

అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ తన చైనా వ్యాపారాన్ని విక్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ ప్రక్రియలో అవకాశాలను అంచనా వేయడానికి జేపీమోర్గాన్ సంస్థ సహకరిస్తున్నట్లు సమాచారం. చైనా కార్యకలాపాలను సుమారు 1.5 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.14 వేల కోట్లు) విక్రయించే దిశగా యాక్సెంచర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు కొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, వ్యూహాత్మక కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, విక్రయ ప్రణాళికపై యాక్సెంచర్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. చైనాలో డేటా నిర్వహణకు సంబంధించిన కఠిన నిబంధనలు ఈ నిర్ణయానికి ఒక కారణమై ఉండవచ్చని సమాచారం. యాక్సెంచర్ గ్రేటర్ చైనా కార్యకలాపాల్లో హాంకాంగ్, తైవాన్ కూడా ఉన్నాయి.
మరోవైపు, ఉద్యోగుల కృత్రిమ మేధ వినియోగానికి సంబంధించిన ఖర్చులపై యాక్సెంచర్ పరిమితులు విధించినట్లు నివేదికలు వెలువడ్డాయి. అక్టోబర్ 1 నుంచి క్లాడ్ ఎంటర్‌ప్రైజ్ సేవల వినియోగంపై ఒక్కో ఉద్యోగికి నెలకు సుమారు రూ.2,700 పరిమితి విధించినట్లు సమాచారం. అదనపు ఏఐ యాక్సెస్ కోరుకునే ఉద్యోగులు, ఆ ఖర్చును భరించే ప్రాజెక్ట్ లేదా బృందాన్ని గుర్తిస్తూ వర్క్ బ్రేక్‌డౌన్ స్ట్రక్చర్ (WBS) సమర్పించాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో, యాక్సెంచర్ తన ఏఐ, డేటా విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను 40 వేల నుంచి సుమారు 1.1 లక్షలకు పెంచినట్లు సంస్థ సీఈఓ జూలీ స్వీట్ వెల్లడించినట్లు సమాచారం. ఏఐ ద్వారా ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచుకోవడంపై సంస్థ దృష్టి సారిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!