

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం గత ఏడాది ఇదే కాలంలోని రూ.7,364 కోట్లతో పోలిస్తే 6.2 శాతం పెరిగి రూ.7,823 కోట్లకు చేరింది. కార్యకలాపాల ఆదాయం 10.2 శాతం వృద్ధితో రూ.44,490 కోట్ల నుంచి రూ.49,244 కోట్లకు పెరిగింది. కృత్రిమ మేధ (ఏఐ) విభాగం కంపెనీ మొత్తం ఆదాయంలో 10.5 శాతం వాటా సాధించగా, త్రైమాసిక ప్రాతిపదికన 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. సంస్థ ఏఐ సేవలను విస్తరించడం, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ రంగంలో పెరుగుతున్న అవకాశాలు ఈ వృద్ధికి దోహదం చేశాయని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ తెలిపారు.
జులై–సెప్టెంబరు త్రైమాసికంలో ఇన్ఫోసిస్ భారీ ఒప్పందాల విలువ 5.2 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో ఏడేళ్ల కాలానికి సంబంధించిన 2 బిలియన్ డాలర్లకు పైగా విలువైన మెగా ఒప్పందం కూడా ఉంది. కంపెనీ నిర్వహణ మార్జిన్ 21 శాతంగా కొనసాగింది. అయితే, అమెరికా మార్కెట్లో డిమాండ్ మందగించడంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాను స్థిర కరెన్సీ ప్రాతిపదికన 1.5–3 శాతం నుంచి 1–2 శాతానికి తగ్గించింది. నిర్వహణ మార్జిన్ అంచనాను 20–22 శాతంగా కొనసాగించింది. సమీక్షా త్రైమాసికంలో నికరంగా 4,000 మంది ఉద్యోగులు పెరగగా, కళాశాలల నుంచి 8,000 మందిని నియమించుకున్నట్లు పరేఖ్ తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్ల నియామకమే లక్ష్యమని వెల్లడించారు. మరోవైపు, ఒక్కో షేరుకు రూ.26 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 13 శాతం అధికం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!