

అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతలకు శ్రీకారం చుట్టింది. ఈసారి కంపెనీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులపై ప్రభావం పడింది. ఈ ఏడాది జనవరిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత, అమెజాన్‌కు ఇది మరో కీలక ఉద్యోగాల కోతగా నిలిచింది. అయితే తాజా కోతల్లో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
అమెజాన్ ప్రతినిధుల ప్రకారం, సంస్థ చాలా కాలంగా భారీ ఏఐ మోడళ్ల అభివృద్ధిపై పనిచేస్తోంది. వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనం అందించే కీలక ఏఐ ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టేందుకు సంస్థాగత మార్పులు చేపట్టినట్లు తెలిపారు. ఏఐ అభివృద్ధి నుంచి వెనక్కి తగ్గడం కాదని, వనరులను మరింత సమర్థంగా వినియోగించేందుకు ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు కంపెనీ స్పష్టం చేసింది.
ఇటీవల అమెజాన్ ఏజీఐ విభాగంలో నాయకత్వ మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. ఆన్‌లైన్ సమాచారం ప్రకారం, ఏజీఐ డేటా సర్వీసెస్, ఏజీఐ ఇన్ఫర్మేషన్ విభాగాల్లోని కొన్ని బృందాల ఉద్యోగులు ఈ కోతల ప్రభావానికి గురయ్యారు. ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నప్పటికీ, ఏడబ్ల్యూఎస్ ద్వారా జనరేటివ్ ఏఐసేవలు, నోవా ఫౌండేషన్ మోడళ్ల అభివృద్ధిపై అమెజాన్ పెట్టుబడులు కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!