

ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఆంథ్రోపిక్ తన కంపెనీలోని 5 శాతం వాటాను ప్రజాప్రయోజనాల కోసం ఏర్పాటు చేయనున్న నిధికి కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. వాటాలను ప్రత్యేక నిధికి బదులుగా నేరుగా ప్రజలకే ఇవ్వాలని సూచించారు. భవిష్యత్తులో తాను కూడా ఇదే విధంగా చేయబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఏ కంపెనీ వాటాలను ప్రజలకు పంపిణీ చేస్తారు, ఎప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారు అనే వివరాలను మస్క్ వెల్లడించలేదు.
ఆంథ్రోపిక్ ఏర్పాటు చేయనున్న ఈ నిధికి ‘ఆంథ్రోపిక్ పబ్లిక్ బెనిఫిట్ ఫండ్’ అని పేరు పెట్టారు. కంపెనీ విలువ ప్రతి 50 శాతం పెరిగినప్పుడూ అదనంగా 2 శాతం వాటాలను ఈ నిధికి కేటాయించాలని సంస్థ నిర్ణయించింది. స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందించడం, అవసరమైన వర్గాలకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు, కృత్రిమ మేధ కారణంగా ఉద్యోగ రంగంలో వచ్చే మార్పులు, కార్మికులు ఎదుర్కొనే సమస్యలపై ఈ నిధి దృష్టి సారించనుంది. ఈ అంశాలపై పరిశోధన కోసం ఇప్పటికే 200 మిలియన్ డాలర్లు కేటాయించినట్లు సంస్థ తెలిపింది. ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకులు తమ వాటాల్లో 80 శాతం విరాళంగా ఇస్తామని గతంలో ప్రకటించగా, ఉద్యోగుల్లో దాదాపు సగం మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ముందుకొచ్చారు. మొత్తంగా కంపెనీ వాటాల్లో సుమారు 20 శాతం ప్రజాప్రయోజనాలకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఈ నిధులను రాజకీయ విరాళాలు లేదా లాబీయింగ్ కోసం వినియోగించబోమని ఆంథ్రోపిక్ స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!