

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు చేసింది. సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహించే ఆన్‌లైన్ అసెస్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులను ప్రస్తుత 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. అలాగే, డ్రైవింగ్‌కు సంబంధించిన అవగాహన ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల పాటు ఉండాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రతిపాదనలపై భాగస్వామ్య పక్షాల నుంచి 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్‌లో పేరు, చిరునామా మార్పులకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు 15 రోజుల్లోగా ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. తిరస్కరిస్తే అందుకు గల కారణాలను వెల్లడించాలి. చిరునామా మార్పు దరఖాస్తుపై 30 రోజుల్లోగా నిర్ణయం తీసుకోకపోతే ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని ప్రతిపాదించారు. ఆధార్ ధ్రువీకరణతో ఆన్‌లైన్‌లో పొందే కొన్ని లైసెన్స్ సేవలకు ఫీజు మినహాయింపు ఇవ్వడంతో పాటు, వ్యక్తిగత వివరాల మార్పులకూ ఛార్జీలు తొలగించాలని భావిస్తున్నారు. గుర్తింపు, వయసు, చిరునామా ధ్రువీకరణకు ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, జనన ధ్రువీకరణ పత్రాలు, విద్యా ధ్రువీకరణ పత్రాలు, ఇ-రేషన్ కార్డు, ఇటీవల జారీ చేసిన విద్యుత్, గ్యాస్ బిల్లులను అనుమతించాలని ప్రతిపాదించారు. చిరునామా ధ్రువీకరణ పత్రాల జాబితా నుంచి ఎల్‌ఐసీ పాలసీలను తొలగించాలని పేర్కొన్నారు. కొత్తగా జారీ చేసే, రెన్యువల్ చేసే డ్రైవింగ్ లైసెన్సులను లామినేటెడ్ లేదా పీవీసీ కార్డు రూపంలో అందించాలని కూడా ముసాయిదాలో సూచించారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!