

భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రవేశంపై ఎలాన్ మస్క్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య నెలకొన్న వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. స్టార్‌లింక్ సేవలను భారత్‌లో ప్రారంభించకుండా కొన్ని వ్యాపార వర్గాలు అడ్డుకుంటున్నాయన్న మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్పందించింది. దేశీయ, విదేశీ సంస్థల నుంచి వచ్చే పోటీని తాము స్వాగతిస్తామని, అయితే ప్రతి సంస్థ భారత చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
తమ సంస్థ వృద్ధి భారత చట్టాలకు అనుగుణంగా సాగిందని రిలయన్స్ పేర్కొంది. జియో శాటిలైట్ సేవలకు కూడా ఇంకా నియంత్రణ సంస్థల అనుమతులు రావాల్సి ఉందని గుర్తుచేసింది. స్టార్‌లింక్, జియో, ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్ సంస్థలు అనుమతుల ప్రక్రియలో ఉన్నాయని తెలిపింది. 2016లో టెలికాం రంగంలోకి ప్రవేశించిన జియో ప్రస్తుతం కోట్లాది మంది వినియోగదారులకు సేవలందిస్తోందని పేర్కొంటూ, స్టార్‌లింక్ లైసెన్సును అడ్డుకుంటున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చింది.
రిలయన్స్ ప్రకటన తర్వాత స్టార్‌లింక్ స్పందిస్తూ, గత ఐదేళ్లుగా భారత నియంత్రణ సంస్థలు, టెలికాం ఆపరేటర్లతో కలిసి పనిచేస్తున్నామని, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని ఎక్స్ వేదికగా తెలిపింది. భారత్‌ను అధిక వేగం గల ఇంటర్నెట్తో అనుసంధానించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. దీనిపై ఎలాన్ మస్క్ “Much appreciated” అంటూ స్పందించారు. మరోవైపు, అనుమతుల ప్రక్రియలో తాము మస్క్ కంటే ఐదేళ్లు ముందున్నామని ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. తుది అనుమతులు ఇంకా రావాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!