

భారత్‌లో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్‌కు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌లో డ్రోన్ కార్యకలాపాలకు అంతరాయం కలిగేలా స్టార్‌లింక్ ఉపగ్రహ నెట్‌వర్క్ వేగాన్ని తగ్గించాలని మస్క్ స్వయంగా ఆదేశించినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం వెల్లడించింది. ఈ కథనం ఇద్దరు అమెరికా అధికారులు, సంబంధిత వర్గాలను ఉటంకించింది.
ఉద్దేశపూర్వకంగా నెట్‌వర్క్ వేగాన్ని తగ్గించడం ఉక్రెయిన్‌లో ఆందోళనకు దారితీసిందని, అమెరికా యంత్రాంగాన్ని అయోమయానికి గురిచేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో రష్యాతో సంబంధాలపై పరిణామాలు చోటుచేసుకుంటున్న సమయంలో ఉక్రెయిన్ డ్రోన్ల కార్యకలాపాలు మందగించినట్లు కథనం పేర్కొంది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఉపయోగిస్తున్న స్టార్‌లింక్ కమ్యూనికేషన్ పరికరాలపై మస్క్ ఆంక్షలు విధించినట్లు గతంలో వార్తలు వచ్చినప్పటికీ, ఆయన వాటిని ఖండించారు.
సైనిక అవసరాల కోసం ఉపయోగించే స్టార్‌షీల్డ్ అమెరికా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుందని మస్క్ గతంలో స్పష్టం చేశారు. స్టార్‌లింక్ సేవల వేగాన్ని తగ్గించాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా వెల్లడించారు. ఉక్రెయిన్ విజయం సాధించాలని అమెరికా కోరుకుంటోందని వారు పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!