

అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ ఐబీఎం భారత్‌లో కార్యాలయ విస్తరణను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని బాగ్మానే సోలేరియం సిటీలో ఉన్న రాడాన్ టవర్‌లో 2.83 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని పదేళ్లకు లీజుకు తీసుకుంది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా ప్రాప్‌స్టాక్ వెల్లడించిన వివరాల ప్రకారం, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి, రెండో, మూడో అంతస్తులు ఈ ఒప్పందంలో ఉన్నాయి. చదరపు అడుగుకు నెలకు రూ.88 చొప్పున ఐబీఎం ప్రారంభ అద్దెగా సుమారు రూ.2.49 కోట్లు చెల్లించనుంది. ప్రతి మూడేళ్లకు అద్దెను 15 శాతం పెంచేలా ఒప్పందం కుదిరింది. భవన యజమాని ఆకృతి ఇన్‌ఫ్రా-బిల్డ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.14.96 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించింది.
సాధారణ అద్దెకు అదనంగా కార్యాలయ అంతర్గత ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కోసం ఐబీఎం నెలకు సుమారు రూ.2.98 కోట్ల ఫిట్-అవుట్ అద్దె చెల్లించనుంది. ఈ చెల్లింపులు మార్చి 2031 వరకు కొనసాగనుండగా, వాటి మొత్తం వ్యయం దాదాపు రూ.179 కోట్లుగా అంచనా వేశారు. దీంతో అద్దె, ఫిట్-అవుట్ ఖర్చులు కలిపి సుమారు రూ.522 కోట్లకు చేరనున్నాయి. లీజు 2026 ఫిబ్రవరి 5న ప్రారంభమైంది. ఒప్పందంపై మే 29న సంతకాలు జరగగా, అక్టోబర్ 1న రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు పత్రాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో గురుగ్రామ్‌లోనూ 2.30 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఐబీఎం లీజుకు తీసుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి దివ్యశ్రీ ఓరియన్ క్యాంపస్‌లోనూ సంస్థకు కార్యాలయ కార్యకలాపాలు ఉన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!