

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. రోజంతా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు చివర్లో కొంత కోలుకున్నప్పటికీ నష్టాల నుంచి బయటపడలేకపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 125.56 పాయింట్లు నష్టపోయి 73,123.83 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 72,452.37 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్, ఆరంభంలో మాత్రం లాభాల్లో ట్రేడైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సుమారు 88 పాయింట్లు తగ్గి 22,600 స్థాయిలో ముగిసింది.
సెన్సెక్స్‌లో టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, టెక్ మహీంద్రా, బీఈఎల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు ఎటర్నల్, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 114 డాలర్ల సమీపానికి చేరడం చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.94.94గా నమోదైంది. చమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్ల తదుపరి కదలికలను ప్రభావితం చేసే అంశాలుగా నిలిచాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!