

దేశ, విదేశాల్లో వ్యాపార రంగంలో విజయాలు సాధిస్తున్న యువ భారతీయ పారిశ్రామికవేత్తలతో ‘అవెండస్ వెల్త్–హురున్ ఇండియా అండర్ 35’ జాబితా విడుదలైంది. ఈ ఏడాది జాబితాలో 180 మందికి చోటు లభించింది. 2025లో ఉన్న 155 మందితో పోలిస్తే ఈ సంఖ్య 16 శాతం పెరిగింది. ఈ పారిశ్రామికవేత్తలకు చెందిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.48 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 23 శాతం అధికం. జాబితాలోని 37 కంపెనీల విలువ ఒక్కొక్కటి 100 కోట్ల డాలర్లకు, అంటే సుమారు రూ.9,500 కోట్లకు పైగా ఉందని నివేదిక వెల్లడించింది.
ఈ జాబితాలో 127 మంది, అంటే 71 శాతం మంది తొలి తరం పారిశ్రామికవేత్తలే ఉన్నారు. మిగతా 53 మంది కుటుంబ వ్యాపారాలను వారసత్వంగా అందుకున్నవారు. వీరిలో 16 శాతం మంది రెండో తరం, 9 శాతం మంది మూడో తరం, 4 శాతం మంది నాలుగో తరానికి చెందినవారు. ఈసారి జాబితాలో 23 మంది మహిళలకు చోటు దక్కింది. మొత్తం జాబితాలో వారి వాటా 12.8 శాతంగా ఉంది.
నగరాల వారీగా చూస్తే బెంగళూరు నుంచి అత్యధికంగా 52 మంది జాబితాలో నిలిచారు. ముంబై నుంచి 30 మంది, ఢిల్లీ నుంచి 25 మంది చోటు దక్కించుకున్నారు. గురుగ్రామ్ నుంచి 14 మంది, శాన్ఫ్రాన్సిస్కో, అహ్మదాబాద్ నుంచి 10 మంది చొప్పున ఉన్నారు. నోయిడా నుంచి ఏడుగురు, హైదరాబాద్ నుంచి ఐదుగురు ఈ జాబితాలో స్థానం సంపాదించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!