

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) బ్రిటన్‌లో భారీగా ఉద్యోగాలను తగ్గించే యోచనలో ఉన్నట్లు ‘ది టైమ్స్’ నివేదించింది. రాబోయే రెండేళ్లలో సుమారు 4,000 ఉద్యోగాలకు కోత విధించే అవకాశం ఉందని పేర్కొంది. అమెరికా టారిఫ్‌ల ప్రభావం, పెరుగుతున్న తయారీ వ్యయాలు, వాహనాల అమ్మకాల్లో మందగమనం వంటి కారణాలతో ఖర్చులను తగ్గించుకునే దిశగా కంపెనీ ఈ చర్యకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగాల కోతకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే సమాచారం అందించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా వేతన సిబ్బంది, మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. బ్రిటన్‌లో జేఎల్‌ఆర్ సుమారు 34 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. చైనా కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అధిక వ్యయం, అంతర్జాతీయ వాణిజ్య ఒత్తిళ్లు కూడా కంపెనీపై ప్రభావం చూపుతున్నాయి. జూన్ 2026తో ముగిసిన త్రైమాసికంలో జేఎల్‌ఆర్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 9.6 శాతం తగ్గి 6 బిలియన్ పౌండ్లకు చేరింది. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా సుమారు 1.7 బిలియన్ పౌండ్ల పొదుపు లక్ష్యాన్ని కంపెనీ పెట్టుకుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!