

హైదరాబాద్: ఈ ఏడాది ప్రారంభంలో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన వెండి ధరలు ప్రస్తుతం దిగివస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం ఒక దశలో కిలో వెండి ధర రూ.1.97 లక్షలకు పడిపోయింది. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,46,460గా, కిలో వెండి ధర రూ.2,03,460గా నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన వెంటనే బంగారం, వెండి ధరలు తగ్గగా.. ఒక దశలో 10 గ్రాముల బంగారం రూ.1.45 లక్షలకు చేరింది. అనంతరం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్సు ధర 4,035 డాలర్ల వద్ద, వెండి ఔన్సు ధర 54.35 డాలర్ల వద్ద నమోదైంది. దేశీయ కమొడిటీ ఎక్స్ఛేంజ్ ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ ఒక దశలో రూ.1,93,545 వద్ద ట్రేడయ్యాయి. గత ముగింపు ధరతో పోలిస్తే దాదాపు రూ.6,000 తగ్గాయి. ద్రవ్యోల్బణ భయాలు, అమెరికాలో వడ్డీ రేట్లు అధిక స్థాయుల్లో కొనసాగవచ్చన్న అంచనాలు, ప్రపంచ తయారీ రంగం మందగించడం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనల కారణంగా పారిశ్రామిక రంగంలో వెండికి గిరాకీ తగ్గుతోంది. గతేడాది డిసెంబర్లో తొలిసారిగా రూ.2 లక్షల మార్కును దాటిన వెండి ధర, సుమారు పది నెలల తర్వాత ఆ స్థాయి దిగువకు చేరింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!