

డ్రైవర్లపై కమీషన్ల భారాన్ని తగ్గించడం, ప్రయాణికులకు సర్జ్ ప్రైసింగ్ నుంచి ఉపశమనం కల్పించడం, సురక్షితమైన ప్రయాణ సేవలు అందించడం లక్ష్యంగా వరంగల్‌కు చెందిన యువకుడు వంగేటి నిఖిల్ కుమార్ తన ఇద్దరు మిత్రులతో కలిసి 2023లో ప్రారంభించిన రూటూర్ రైడ్ బుకింగ్ యాప్ వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరాల్లో సేవలను ప్రారంభించింది. దసరా పండుగ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా, ర్యాపిడో తరహాలో బైక్, ఆటో, క్యాబ్ సేవలను అందిస్తోంది. తొలుత హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40కిపైగా నగరాలకు విస్తరించినట్లు తెలిపింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదపురం గ్రామానికి చెందిన నిఖిల్ కుమార్ యూకేలో ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఎంఎస్సీ పూర్తి చేశారు. అనంతరం అక్కడే రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ రంగంలో ఆపరేషన్స్ మేనేజర్‌గా ఆరేళ్లపాటు పనిచేశారు. ఆ సమయంలో రవాణా రంగంలోని సమస్యలను గమనించిన ఆయన, డ్రైవర్ల ఆదాయంపై కమీషన్ల ప్రభావాన్ని తగ్గిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే వేదికను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తన డిగ్రీ స్నేహితులైన అక్షయ్, గంధం క్రాంతికుమార్‌లతో కలిసి రూటూర్‌ను ప్రారంభించారు. సంస్థలో నిఖిల్ సీఈవోగా, క్రాంతికుమార్ సీఓఓగా, అక్షయ్ సీఎఫ్‌వోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రయాణికుల భద్రతకు రూటూర్ ప్రాధాన్యమిస్తోంది. రూటూర్ కెప్టెన్ యాప్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకునే డ్రైవర్ల వివరాలు, పోలీస్ క్లియరెన్స్ వంటి పత్రాలను పరిశీలించిన తర్వాతే సంస్థ అనుమతి ఇస్తోంది. ప్రయాణ సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రయాణికులు సహాయం పొందేందుకు ఎస్‌ఓఎస్ బటన్, లైవ్ లొకేషన్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించడం, వారిని సురక్షిత ప్రాంతాల్లో దించడం వంటి అంశాలపై డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని కూడా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రయాణికులు ప్లే స్టోర్, యాప్ స్టోర్ ద్వారా రూటూర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సేవలను వినియోగించుకోవచ్చు. ప్రధాన రహదారుల నుంచి కాలనీల వరకు ప్రయాణాన్ని సులభతరం చేసే చివరి మైలు అనుసంధానంపై సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. డ్రైవర్ల సంపాదనలో కమీషన్ల రూపంలో కోత పడకుండా వారికి వేదిక కల్పించడమే తమ వ్యాపార నమూనా లక్ష్యమని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. సొంత ప్రాంతమైన వరంగల్, హనుమకొండ, కాజీపేటల్లో సేవలు ప్రారంభించడం సంస్థకు కీలక ముందడుగుగా నిలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!