

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పుడు చాలామంది హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేయడాన్ని తగ్గించి, తక్కువ ధరకు మంచి ఆహారం అందించే ప్రదేశాల వైపు మొగ్గు చూపుతారు. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 4.83 శాతంగా ఉండగా, సెప్టెంబర్‌లో 5.54 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ఆహార ద్రవ్యోల్బణం కూడా 5.97 శాతం నుంచి 7.74 శాతానికి చేరింది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులకు అందుబాటు ధరల్లో ఆహారం అందించడంపై వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ దృష్టి సారించింది. ఈ సంస్థ పశ్చిమ, దక్షిణ భారతదేశాల్లో మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రూ.99కే భోజనం అందిస్తోంది. మార్కెట్ పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ, మెక్‌డొనాల్డ్స్ వినియోగదారులకు మంచి విలువను అందిస్తోందని వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ సీఈఓ అక్షయ్ జాటియా తెలిపారు. ధరలను భారీగా తగ్గించకుండా, తరచుగా పెంచకుండా నాణ్యమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ మంచి వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సంస్థ ఆదాయం 16 శాతం పెరిగి రూ.747 కోట్లకు చేరుకుంది. అదే స్టోర్లలో అమ్మకాలు 10 శాతం వృద్ధి చెందాయి. ప్రతి నెలా కస్టమర్ల సంఖ్య రెండంకెల శాతంలో పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. రెస్టారెంట్లలో కూర్చొని భోజనం చేసే వినియోగదారుల ద్వారా వచ్చే అమ్మకాలు 17 శాతం పెరగగా, పార్సిల్, ఇతర మార్గాల్లో జరిగే అమ్మకాలు 15 శాతం వృద్ధి చెందాయి. ఆహార ధరలు పెరుగుతున్నప్పటికీ మెక్‌డొనాల్డ్స్‌కు వస్తున్న కస్టమర్ల సంఖ్య పెరుగుతుండటం సంస్థకు ఊరటనిస్తోంది. అందుబాటు ధరలు, వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడం ద్వారా వృద్ధిని కొనసాగించాలని కంపెనీ భావిస్తోంది.
వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ గత ఏడాది నుంచే తక్కువ ధరలకు భోజనం అందించే విధానాన్ని అమలు చేస్తోంది. తొలుత పశ్చిమ భారతదేశంలో రూ.99 భోజన పథకాన్ని ప్రారంభించి, అనంతరం దక్షిణ భారతదేశానికి విస్తరించింది. ఈ పథకం ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షించడంతో పాటు, ఇప్పటికే రెస్టారెంట్లకు వస్తున్న వారు మళ్లీ మళ్లీ వచ్చేలా చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్‌లో జరిగిన కంపెనీ సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ కల్రా మాట్లాడుతూ, గత త్రైమాసికాలతో పోలిస్తే డిస్కౌట్లను పెంచకుండానే తక్కువ ధరల పథకాన్ని మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు. కొన్ని సందర్భాల్లో డిస్కౌట్లను తగ్గించడం ద్వారా పెరుగుతున్న ఖర్చులను నియంత్రించామని చెప్పారు. ద్రవ్యోల్బణం కారణంగా వినియోగదారులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, అందుబాటు ధరలకు ఆహారం అందించడం, నిర్వహణ ఖర్చులను నియంత్రించడం ద్వారా వ్యాపార వృద్ధిని కొనసాగించాలని సంస్థ భావిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!