

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఓ అభిమానికి ఇచ్చిన హాస్యభరిత సమాధానం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ప్రణేశ్ నాయుడు అనే ఎక్స్ వినియోగదారుడు తాను చిన్నప్పటి నుంచి ఆనంద్ మహీంద్రాకు అభిమానినని పేర్కొన్నాడు. మహీంద్రా స్కార్పియోలో శక్తిమంతమైన వీ8 లేదా వీ10 ఇంజిన్‌ను ప్రవేశపెట్టాలని సూచించాడు. ముఖ్యంగా 500 హార్స్‌పవర్ ఉత్పత్తి చేసే వీ8 ఇంజిన్‌ను అమర్చితే స్కార్పియో మరింత ఆకర్షణీయంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో ఆనంద్ మహీంద్రా మరో 20 ఏళ్లలో మరణించే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానిస్తూ, ఆలోపు అలాంటి శక్తిమంతమైన ఇంజిన్‌ను తయారు చేయాలని కోరాడు.
అభిమాని వ్యాఖ్యపై ఆనంద్ మహీంద్రా చమత్కారంగా స్పందించారు. తనను అభిమానిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెబుతూనే, తన జీవితానికి మరో 20 ఏళ్లే గడువు విధిస్తూ అంత నమ్మకంగా ఎలా చెప్పగలిగారని సరదాగా ప్రశ్నించారు. మరో 20 ఏళ్ల జీవితం కూడా గౌరవప్రదమైన ప్రయాణమే అయినప్పటికీ, తాను ఈ భూమిపై అంతకంటే ఎక్కువకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ తర్వాత వీ8 ఇంజిన్ల గురించి చర్చించే ముందు తన జీవితానికి వారంటీ పొడిగించగలరా అని అభిమానికి చమత్కారంగా ప్రశ్నించారు. ఆయన సమాధానం సోషల్ మీడియాలో పలువురిని ఆకట్టుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!