

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ ‘ధర్మరథం’ బస్సులను విరాళంగా అందించినట్లు సమాచారం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రకటించిన 25 బస్సుల్లో తొలి విడతగా 15 ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలకు చేరుకోగా, మిగిలిన బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
ఈ బస్సుల నిర్వహణలో భాగంగా 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థ భరించనుందని, తిరుమలలో ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, గుజరాత్‌లోని వంతారా ప్రాజెక్టు తరహాలో తిరుమల గోశాలను ఆధునీకరించేందుకు కూడా అనంత్ అంబానీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ చర్యలు అమలులోకి వస్తే భక్తుల రవాణా సౌకర్యాలతో పాటు గోశాల అభివృద్ధికి కూడా తోడ్పడే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!