

2003లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘రింగ్ రోడ్డు’ హత్య కేసులో ప్రధాన నిందితురాలు శుభ శంకరనారాయణ, ఆమె ప్రియుడు డి. అరుణ్ వర్మతో పాటు మరో ఇద్దరు దోషులకు క్షమాభిక్ష ఇవ్వాలని సిఫార్సు చేయకూడదని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయించింది. కాబోయే భర్త గిరీశ్ను హత్య చేయించిన కేసులో 2010లో హైకోర్టు ఈ నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. శిక్ష నుంచి ఉపశమనం కల్పించే అంశాన్ని గవర్నర్ విచక్షణకు వదిలివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ కేసుపై చర్చించిన మంత్రివర్గం.. నిందితుల క్షమాభిక్షకు సిఫార్సు చేయకూడదని తీర్మానించింది.
2003 డిసెంబరు 1న బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గిరీశ్తో శుభకు నిశ్చితార్థం జరిగింది. అప్పటికే తన సీనియర్ అరుణ్ వర్మతో ప్రేమలో ఉన్న శుభ.. ఈ వివాహం ఇష్టం లేక అతడితో కలిసి గిరీశ్ను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిశ్చితార్థం జరిగిన రెండు రోజులకే గిరీశ్ను భోజనానికి పిలిచి, హెచ్ఏఎల్ విమానాశ్రయం సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ అరుణ్ వర్మ, మరో ఇద్దరు ద్విచక్రవాహనం షాక్ అబ్జార్బర్తో గిరీశ్పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గిరీశ్ మరుసటి రోజు మరణించాడు. అనంతరం విచారణ చేపట్టిన హైకోర్టు నలుగురికీ యావజ్జీవ శిక్ష విధించింది. సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ నేరంలో దోషులకు క్షమాభిక్ష ఇవ్వడం సముచితం కాదని ప్రభుత్వం అభిప్రాయపడింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!