

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరు దేశాలు పరస్పరం డిజిటల్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్ చేపట్టిన ప్రతీకార దాడుల్లో రష్యాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ యాండెక్స్ (Yandex) నిర్వహిస్తున్న ఐదు ప్రధాన డేటా సెంటర్లలో మూడు దెబ్బతిన్నట్లు కథనాలు వెల్లడించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ అంతరాయాల ప్రభావం కనిపించడంతో ట్యాక్సీ బుకింగ్‌లు, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు, డిజిటల్ చెల్లింపులు, క్లౌడ్ స్టోరేజ్ సేవలకు ఆటంకం ఏర్పడింది. యాండెక్స్ సేవలపై ఆధారపడే ఇతర ప్లాట్‌ఫామ్‌లు సైతం ప్రభావితమైనట్లు సమాచారం. కొందరు వినియోగదారులు తమ డిజిటల్ వాలెట్లు, బ్యాంకు ఖాతాల్లోని డబ్బును వినియోగించుకోలేకపోగా, మరికొందరు క్లౌడ్‌లో భద్రపరిచిన ఫైళ్లను తెరవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిజిటల్ తాళాలు పనిచేయకపోవడంతో కొంతమంది తమ ఇళ్లలోకి ప్రవేశించేందుకు కూడా అవస్థలు పడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.
యాండెక్స్ ట్యాక్సీ సేవల్లో తలెత్తిన సమస్యలతో ప్రయాణికులు చెల్లించిన మొత్తాలను గుర్తించడం, వాటిని ఉపసంహరించుకోవడం కష్టంగా మారిందని డ్రైవర్లు తెలిపారు. సాంకేతిక లోపాల కారణంగా ఒకే కస్టమర్‌కు ఒకటికంటే ఎక్కువ కార్లు బుక్ అయిన సందర్భాలూ ఉన్నాయని వెల్లడించారు. సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన ఇరినా అనే మహిళ.. చెల్లింపులు చేయలేక తన బిడ్డకు ఆహారం కొనుగోలు చేయడం కూడా కష్టమైందని ఆవేదన వ్యక్తం చేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు, తమ సేవలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని యాండెక్స్ ప్రకటించింది. రష్యాలోని అతిపెద్ద బ్యాంక్ స్బెర్, టెక్ సంస్థ వీకే కూడా ఇటీవల దాడులకు గురైనట్లు సమాచారం. ఉక్రెయిన్‌లోని డేటా సెంటర్లపై రష్యా దాడులు చేయడంతో ప్రతిగా రష్యా డిజిటల్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కథనాలు చెబుతున్నాయి. ఒకే సంస్థకు చెందిన డిజిటల్ సేవలపై ప్రజలు అధికంగా ఆధారపడటం వల్లే ఈ అంతరాయాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా కనీస అవసరాలకు సంబంధించిన సేవలు సైతం నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది.









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!