

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ దర్శన వేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నిర్ణయం తీసుకుంది. సీజన్ మార్పు నేపథ్యంలో నవంబర్ 1 నుంచి కొత్త సమయాలు అమల్లోకి రానున్నాయి. తాజా షెడ్యూల్ ప్రకారం ఆలయం ఉదయం 4 గంటలకు తెరుచుకుని రాత్రి 10 గంటలకు మూసివేస్తారు. ప్రస్తుతం తెల్లవారుజామున 3:45 గంటలకు ఆలయాన్ని తెరిచి, రాత్రి 10:30 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. కొత్త సమయాల ప్రకారం ఉదయం 4:30 నుంచి 4:40 గంటల వరకు మంగళ హారతి నిర్వహిస్తారు. అనంతరం అభిషేకం, ఇతర పూజా కార్యక్రమాల కోసం ఉదయం 6:30 గంటల వరకు ఆలయ ద్వారాలను మూసి ఉంచుతారు. ఆ తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతి కల్పిస్తారు.
ఉదయం 8 నుంచి 8:10 గంటల వరకు బాలభోగ్ నైవేద్యం సమర్పించేందుకు ఆలయ ద్వారాలను తాత్కాలికంగా మూసివేస్తారు. అనంతరం ఉదయం 11:30 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భోగ్ నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 గంటల వరకు విరామం ఉంటుంది. 1:35 గంటల నుంచి భక్తులకు తిరిగి దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 6 గంటలకు సంధ్యా హారతి నిర్వహిస్తారు. ఈ సమయంలో 15 నిమిషాల పాటు ఆలయ ద్వారాలను మూసివేసి, అనంతరం మళ్లీ భక్తుల దర్శనార్థం తెరుస్తారు. భక్తులు అయోధ్య రామాలయాన్ని సందర్శించే ముందు కొత్త దర్శన వేళలను గమనించాలని సూచిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!