

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పట్టందూర్ అగ్రహారంలో అద్దె వివాదం హత్యకు దారితీసింది. స్థానికంగా నివసించే న్యాయవాది, ఇంటి యజమాని మంజునాథ్ (42)ను ఆదివారం రాత్రి కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. మంజునాథ్‌కు చెందిన ఇంట్లో ఇద్దరు యువకులు అద్దెకు ఉంటున్నారని, కొంతకాలంగా వారు అద్దె సక్రమంగా చెల్లించడం లేదని సమాచారం. ఈ విషయమై యజమానికి, అద్దెదారులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వివాదం తీవ్రరూపం దాల్చడంతో నిందితుల్లో ఒకరు తుపాకీతో మంజునాథ్ తలపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే మరణించారు.
కాల్పుల అనంతరం నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, వారిద్దరూ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వైట్‌ఫీల్డ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అద్దె చెల్లింపుల వివాదమే హత్యకు ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ, ఇతర కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!