

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఉదయం నుంచే దశలవారీగా అసెంబ్లీ వైపు వస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకున్నారు. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు వరుసగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి ముట్టడికి యత్నించిన సమయంలో రాంచందర్ రావుతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్ట్ సందర్భంగా గన్‌పార్క్ వద్ద బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
రాంచందర్ రావును పోలీసులు తీసుకెళ్లకుండా అడ్డుకునేందుకు బీజేవైఎం నేతలు, కార్యకర్తలు రోడ్డుపై నిరసనకు దిగారు. రాంచందర్ రావును తరలిస్తున్న పోలీసు వాహనంపైకి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఎక్కడంతో పోలీసులు అతడిని కిందకు లాగారు. అనంతరం పలువురు కార్యకర్తలు వాహనానికి అడ్డంగా పడుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టి రాంచందర్ రావును అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఇద్దరు కార్యకర్తలకు చేతులు విరిగినట్లు, పలువురికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టగా, వరుస నిరసనలతో అసెంబ్లీ పరిసరాల్లో హైటెన్షన్ కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!