

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. రోహిణిలోని వెంకటేశ్వర్ పబ్లిక్ స్కూల్‌కు ఉదయం 9:37 గంటల సమయంలో తొలుత బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత మయూర్ విహార్‌లోని సాల్వాన్ పబ్లిక్ స్కూల్‌కు ఉదయం 9:57 గంటలకు ఇలాంటి బెదిరింపే అందింది. పాఠశాలల ప్రాంగణాల్లో బాంబులు ఉన్నాయనే సమాచారంతో యాజమాన్యాలు పోలీసులకు సమాచారం అందించాయి. దీంతో ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయా పాఠశాలలకు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు, సిబ్బందిని బయటకు తరలించారు. అనంతరం పోలీసులు, ఫైర్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందాలు పాఠశాల ప్రాంగణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.
ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లేందుకు పాఠశాలల వద్దకు చేరుకున్నారు. బాంబు బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపుల్లో నిజానిజాలను నిర్ధారించేందుకు భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, విమానాశ్రయాలు సహా పలు ప్రముఖ ప్రాంతాలకు బాంబులు పెట్టినట్లు పేర్కొంటూ ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా ఘటనపై తనిఖీలు పూర్తయ్యాక పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!