

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ భారత్, ఐరోపా, అమెరికా, వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే పిలుపులు ఊపందుకుంటుంటాయి. అయితే ఈ ఉద్యమాలు ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రభావాన్ని చూపడం లేదు. ప్రపంచ సరఫరా గొలుసుల్లో చైనా ఉత్పత్తులు లోతుగా అనుసంధానమై ఉండటంతో పాటు సరసమైన ధరలకు లభించడం ఇందుకు ప్రధాన కారణం. బీజింగ్‌తో రాజకీయ విభేదాలు ఉన్న దేశాలు సైతం చైనా నుంచి వస్తువులు, పారిశ్రామిక విడిభాగాలు, ముడిసరకులను పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ ఆధారపడటాన్ని తగ్గించేందుకు అమెరికా, ఐరోపా దేశాలు సరఫరా గొలుసుల వైవిధ్యీకరణ, దేశీయ తయారీకి ప్రోత్సాహకాలు, అధిక సుంకాలు, ఎంపిక చేసిన చైనా ఉత్పత్తులపై ఆంక్షలు వంటి చర్యలు చేపడుతున్నాయి.
భారత్ కూడా ఇదే సవాలును ఎదుర్కొంటోంది. 1962 యుద్ధం తర్వాత దేశంలో చైనా వ్యతిరేక భావనలు బలపడగా.. 2020 జూన్‌లో గల్వాన్ ఘర్షణల అనంతరం అవి మరింత పెరిగాయి. చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు మేకిన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. అయినప్పటికీ చైనా ఇప్పటికీ భారత్‌కు కీలక వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. పారిశ్రామిక విడిభాగాలు, ముడిసరకులు, ఇతర మధ్యంతర ఉత్పత్తుల కోసం చైనాపై ఆధారపడటం వాణిజ్య లోటును పెంచుతోంది. చైనా స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ ఉత్పత్తులకు భారత మార్కెట్‌లో గణనీయమైన ఆదరణ ఉంది. గత దశాబ్దంలో చైనా నుంచి భారత దిగుమతులు వేగంగా పెరిగినప్పటికీ.. అదే స్థాయిలో చైనాకు భారత ఎగుమతులు పెరగలేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చైనా ఎగుమతులు పెరుగుతుండటం అంతర్జాతీయ వాణిజ్యంలో ఆ దేశానికి ఉన్న బలమైన స్థానాన్ని తెలియజేస్తోంది.
అందువల్ల చైనా ఉత్పత్తుల బహిష్కరణలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయడంపై భారత్ దీర్ఘకాలికంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సరఫరా గొలుసులను వైవిధ్యీకరించడం, దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎగుమతుల పోటీతత్వాన్ని మెరుగుపరచడం, అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేయడం కీలకం. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలతో రక్షణ, పునరుత్పాదక ఇంధనం, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో దేశీయ సామర్థ్యం పెరిగింది. అయినప్పటికీ ముడి చమురు, సెమీకండక్టర్ భాగాలు, అధునాతన పారిశ్రామిక సాంకేతికత, తయారీ పరికరాల విషయంలో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అన్ని రంగాల్లో స్వావలంబన సాధించాలంటే నిరంతర పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి, ప్రత్యామ్నాయ అంతర్జాతీయ సరఫరా గొలుసులతో బలమైన అనుసంధానం అవసరం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!