

ఎన్నికల సంఘం సీనియర్ అధికారి మనీశ్ గార్గ్‌పై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు క్యాబినెట్ సెక్రటేరియట్ నిరాకరించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వెల్లడైన పత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జులై 29న క్యాబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్‌కు ఇద్దరు కమిషనర్లు విడివిడిగా లేఖలు రాసినట్లు సమాచారం. ఉన్నతాధికారుల పని బాధ్యతలను మనీశ్ గార్గ్ ఏకపక్షంగా మార్చారని, ఎన్నికల సంఘంతో లేదా సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపలేదని వారు ఆరోపించారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోలేదని, సంబంధిత ఫైళ్లను కోరినా స్పందన రాలేదని వివేక్ జోషి పేర్కొన్నట్లు తెలిసింది. ఈ మార్పులు విధివిధానాలకు, 2023 నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలానికి సంబంధించిన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే, ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, దాని వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోరాదని క్యాబినెట్ సెక్రటేరియట్ తెలిపినట్లు ఆర్టీఐ పత్రాలు వెల్లడించాయి. ఎన్నికల సంఘంలోని సభ్యులందరి తరఫున అధికారిక ఫిర్యాదు అందనందున, ఇద్దరు కమిషనర్లు వ్యక్తిగత హోదాలో రాసిన లేఖల ఆధారంగా చర్యలు తీసుకోవడం సముచితం కాదని పేర్కొంది. లేఖలను స్వీకరించినట్లు తెలియజేస్తూ, వాటి ప్రతులను ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి పంపాలని సూచించింది. మనీశ్ గార్గ్‌కు సంబంధించి భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత విభాగాలకు నోట్ పంపింది. మరోవైపు, గార్గ్ జారీ చేసిన పని బాధ్యతల మార్పు ఉత్తర్వులు ఇద్దరు కమిషనర్ల ఆదేశాల మేరకు అమలు కాలేదని ఎన్నికల సంఘం సెప్టెంబర్ 26న తెలిపింది. ఈ వివాదం విధానపరమైన అంశాలకు లేదా సమాచార సాంకేతిక విభాగం పనితీరుకు సంబంధించింది కాదని, డిప్యుటేషన్‌పై ఉన్న అధికారి వ్యవహారానికి సంబంధించినదని స్పష్టం చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!