

విశాఖ జిల్లా ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారి-16లోని ఆనందపురం-పెందుర్తి సర్వీస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండిగుండం పరిధి సత్తరువు కూడలి వద్ద ముందు వెళ్తున్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు మొత్తం కారుకు వ్యాపించడంతో డ్రైవర్ బయటకు రాలేక వాహనంలోనే చిక్కుకుని సజీవ దహనమయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ఆనందపురం ఎస్సై శివ ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాద సమయంలో కారు నంబర్ ప్లేట్ లారీకి చిక్కుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!