

మనిషి శరీరంలోకి హానికారక వైరస్‌లు ప్రవేశించినప్పుడు వాటిని గుర్తించి, సహజ రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తం చేయడంలో సహాయపడే ప్రొటీన్‌ను సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు గుర్తించారు. డాక్టర్ సంతోష్ చౌహాన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం గత ఏడేళ్లుగా మానవ ప్రొటీన్ల పనితీరుపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా DZP3 ప్రొటీన్‌ను గుర్తించింది. ఈ పరిశోధన వివరాలు ‘ది ఈఎంబీఓ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. అధ్యయనం ప్రకారం, వైరస్ కణంలోకి ప్రవేశించిన వెంటనే ఈ ప్రొటీన్ క్రియాశీలంగా మారి తన నిర్మాణంలో మార్పులు చేసుకుంటుంది. అనంతరం మైటోకాండ్రియా వద్దకు చేరుకుని రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ ప్రొటీన్ టైప్-1 ఇంటర్‌ఫెరాన్ అనే రక్షణ అణువుల విడుదలను ప్రేరేపించి, వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడుతుందని పరిశోధకులు గుర్తించారు. సార్స్-కోవ్-2, చికున్‌గున్యా, జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వంటి వైరస్‌ల నుంచి రక్షణ కల్పించే సామర్థ్యం DZP3 ప్రొటీన్‌కు ఉండవచ్చని డాక్టర్ చౌహాన్ తెలిపారు. అయితే, దీని పనితీరును పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత లోతైన పరిశోధనలు అవసరమని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ ఆధారంగా DZP3 ప్రొటీన్‌ను క్రియాశీలం చేసే ఔషధాల అభివృద్ధిపై పరిశోధకుల బృందం దృష్టి సారించింది. వీటి ద్వారా శరీర సహజ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, వైరస్‌లకు వ్యతిరేకంగా కొత్త చికిత్సా విధానాలను అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి. ఈ పరిశోధనకు కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నిధులు సమకూర్చింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!