

తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరిగిన పీజీ సీట్లకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రాయోజిత పథకం (CSS) కింద రూ.379.29 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు అనుమతులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. గత రెండేళ్లలో రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 465 పీజీ సీట్లు పెరిగాయి. ఒక్కో పీజీ సీటుకు సగటున రూ.81.57 లక్షల చొప్పున కేంద్రం నిధులు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.253 కోట్లు సమకూర్చడంతో మొత్తం రూ.632 కోట్లతో కళాశాలలు, ఆసుపత్రులను అభివృద్ధి చేయనున్నారు.
మరోవైపు, ఈ ఏడాది ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ (NMC) అనుమతులు ఇచ్చింది. ఈ నాలుగు కళాశాలల్లో కలిపి 110 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. ఆయా కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.108 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనుంది. ఇందులో రూ.64 కోట్లను కేంద్ర ప్రభుత్వం సమకూర్చనుంది. ఈ నిధులతో వైద్య విద్యా సంస్థల్లో సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు విద్యార్థులకు, రోగులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!