

రాష్ట్రంలో పలుచోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఆదేశించినప్పటికీ పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ఉత్పత్తిని ఎందుకు పెంచడం లేదని నిలదీశారు. నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు ఏర్పాట్లు చేసినప్పటికీ యాదాద్రి విద్యుత్ ప్లాంట్లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని అధికారులను ఆరా తీశారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని, పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ను సరఫరా చేయాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధికారులను ఉపేక్షించబోనని, నిర్లక్ష్యం కొనసాగితే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్), జెన్కో సీఎండీని సైతం సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. విద్యుత్ అంతరాయాలకు గల కారణాలను వెంటనే వెల్లడించాలని అధికారులను ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!