

తెలంగాణలో ఎల్నినో ప్రభావంతో రానున్న 8 నుంచి 10 నెలల్లో నీరు, విద్యుత్ కొరత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 460 టీఎంసీలకు బదులుగా 209 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. కృష్ణా బేసిన్లో నీటి నిల్వలు 72 శాతం, గోదావరి బేసిన్లో 40 శాతం తక్కువగా ఉన్నాయని, వర్షపాతంలోనూ 23 శాతం లోటు ఉందని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే ప్రాధాన్యంగా వినియోగించాలని, యాసంగిలో వరి సాగును వాయిదా వేసుకుని ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. నీటిని వృథా చేయకుండా ప్రతి చుక్కను పొదుపు చేయాలని ప్రజలకు సూచించారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్ల నుంచి 20 వేల మెగావాట్లకు పెరిగిందని సీఎం వెల్లడించారు. రైతులకు, గృహ అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. పంట నష్టపోయే రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులు, కుంటల మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. దసరా తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అనంతరం కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి అవసరమైన సాయం కోరనున్నట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావం వంద దేశాల్లో కనిపిస్తోందని పేర్కొంటూ, కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను రేవంత్రెడ్డి ఖండించారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు, రైతులు, మీడియా, సినీ ప్రముఖులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!