

మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు దేశ ప్రజలందరికీ అలాయ్ బలాయ్, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆకలి, పేదరికం, అవినీతి, అఘాయిత్యాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధికి ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గతంలో భారతీయుల మధ్య ఉన్న విభేదాలను బ్రిటిష్ పాలకులు తమకు అనుకూలంగా మలుచుకుని దేశాన్ని పాలించారని, ఆ క్రమంలో మన సంస్కృతి, సంప్రదాయాలకు నష్టం కలిగించారని గుర్తుచేశారు. ప్రజల మధ్య ప్రేమను పంచుతూ, ఆత్మీయ అనుబంధాలను బలోపేతం చేసే వేదికగా అలాయ్ బలాయ్ నిలుస్తుందని అన్నారు.
దేశానికి, సమాజానికి ఐక్యతే ప్రధానమని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. భారతీయులందరూ భిన్నత్వాన్ని గౌరవిస్తూ సమైక్యంగా ఉండాలని, ప్రకృతితో మమేకమై జీవించాలని సూచించారు. దేశాభివృద్ధితో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా మాతృభాష తెలుగును పరిరక్షించి భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. మాతృభాష మన కంటి చూపుతో సమానమని, దానిని నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొన్నారు. పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు భారతీయ సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పాలని అన్నారు. పరస్పర కలహాలకు దూరంగా ఉంటూ ప్రేమ, ఆప్యాయత, మానవత్వంతో ముందుకు సాగినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించగలమని అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!