

సింగరేణి కాలరీస్ సంస్థను బలోపేతం చేసి, భవిష్యత్తు తరాలకు ఉపాధి భద్రత కల్పించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించడం, ఉత్పాదకత పెంచడం, కొత్త గనులను అభివృద్ధి చేయడంతోపాటు కీలక ఖనిజాల అన్వేషణలోకి విస్తరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆదివారం సింగరేణి కాలరీస్‌కు చెందిన 66 మంది జనరల్ మేనేజర్లతో నిర్వహించిన ప్రత్యక్ష ఇంటరాక్షన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ పనితీరు, బొగ్గు ఉత్పత్తి, రవాణా, కొత్త గనుల అభివృద్ధి, భవిష్యత్తు విస్తరణ, ఉత్పత్తి వ్యయ నియంత్రణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంస్థ సాధించిన ప్రగతిని అధికారులు వివరించగా, జనరల్ మేనేజర్ల విధులు, బాధ్యతలు, క్షేత్రస్థాయి పనితీరుపై భట్టి విక్రమార్క ఆరా తీశారు.
పదేళ్లపాటు సింగరేణి విస్తరణను పట్టించుకోకుండా, కొత్త బొగ్గు బ్లాకులు అందకుండా చేసి సంస్థను నిర్వీర్యం చేయాలని చూసినవారే.. ఇప్పుడు సింగరేణికి నష్టం జరుగుతోందంటూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గుతోందని, 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, సంస్థకు భవిష్యత్తు లేదని ప్రచారం చేస్తున్నవారు గతంలో ఏం చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సంస్థను బలహీనపరిచే నిర్ణయాలు తీసుకున్నవారే ఇప్పుడు విమర్శలకు దిగడం వెనుక ఉద్దేశమేంటని నిలదీశారు. సింగరేణిని కాపాడేందుకు తమ ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి, కొత్త గనుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
గత పదేళ్లలో సంస్థ అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకోలేదని, విస్తరణకు బదులుగా సంస్థ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. సుమారు 42 వేల మంది శాశ్వత ఉద్యోగులు, మరో 34 వేల నుంచి 36 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఆధారపడిన సింగరేణిని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు గతంలో తీసుకోకపోవడం వల్లే సంస్థ కీలక దశకు చేరుకుందని భట్టి విక్రమార్క అన్నారు. సంస్థను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయంలో విస్తరణకు ఆటంకాలు ఏర్పడ్డాయని విమర్శించారు. సింగరేణి భవిష్యత్తుపై జనరల్ మేనేజర్లు, కార్మిక సంఘాలతో చర్చించిన తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. అందరూ సంస్థ మనుగడ కోసం కొత్తగా ఆలోచించి, అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారని చెప్పారు. గతంలో కేటాయించిన బొగ్గు బ్లాకులను కూడా మళ్లీ వేలం ప్రక్రియలోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చించామని, ఇప్పటికే కేటాయించిన బ్లాకులను సింగరేణి వినియోగించుకునేలా తన వాదనను వివరించానని చెప్పారు. తెలంగాణ, సింగరేణి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుందని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!