

తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియలో ఉపయోగించే టీజీ-ఐపాస్ పోర్టల్ సర్వర్‌పై సైబర్ దాడి జరిగినట్లు సమాచారం వెలువడింది. సర్వర్‌లో “DataLeaks5” అనే ఈమెయిల్ ఐడీతో ర్యాన్సమ్ నోట్ కనిపించినట్లు తెలుస్తోంది. పోర్టల్ డేటాబేస్‌తో పాటు ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైళ్లు కూడా ఆ నోట్‌కు జతచేసినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రభుత్వ ఆన్‌లైన్ వ్యవస్థల సైబర్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఎంతమేరకు నష్టం జరిగింది, ఏవైనా కీలక వివరాలు బయటకు వెళ్లాయా అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటనపై డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ సురేష్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ)కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సర్వర్‌పై దాడి ఎలా జరిగింది, డేటా ఏమైనా చోరీకి గురైందా, ఈ ఘటన వెనుక ఎవరున్నారు అనే కోణాల్లో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పోర్టల్ కార్యకలాపాలపై ప్రభావం పడిందా, ఎన్‌క్రిప్ట్ అయిన ఫైళ్ల పరిస్థితి ఏమిటనే వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే సైబర్ దాడి తీవ్రతపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!