

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటుండటంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. బుధవారం మధ్యాహ్నం నుంచే నగరానికి తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ఇక్కడ ఇరువైపులా కలిపి 18 టోల్ బూత్‌లు ఉండగా, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల రద్దీని తగ్గించేందుకు అధికారులు ఆ మార్గంలో 12 బూత్‌లను తెరిచి టోల్ వసూలు చేస్తున్నారు.
ఫాస్టాగ్ విధానం అమలులో ఉన్నప్పటికీ వాహనాల సంఖ్య పెరగడంతో టోల్ ప్లాజా వద్ద సుమారు అర కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. చిట్యాల, చౌటుప్పల్ ప్రాంతాల్లో అండర్‌పాస్ వంతెనల నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు, జాతీయ రహదారి సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!