

కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని దేవరగట్టులో జరిగే మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. విజయదశమి సందర్భంగా అర్ధరాత్రి జరిగే ఈ ఉత్సవంలో సంప్రదాయంలో భాగంగా భక్తులు కర్రలతో తలపడతారు. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు పాల్గొంటారు. ఈ క్రమంలో పలువురు గాయపడుతుండటంతో పోలీసు, వైద్య బృందాలు అప్రమత్తమయ్యాయి. భక్తుల విశ్వాసం ప్రకారం, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ జైత్రయాత్రను నిర్వహిస్తున్నారు.
ఉత్సవంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 190 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఉత్సవ ప్రాంతంలో 700 ఎల్‌ఈడీ లైట్లు, 110 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 10 డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. దేవరగట్టుకు వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు, పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం లక్ష వాటర్ ప్యాకెట్లు, 30 పడకల తాత్కాలిక వైద్య శిబిరం, 10 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. వ్యక్తిగత లేదా రాజకీయ కక్షలతో దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!