

చింతూరు డివిజన్‌లోని ఎన్నికల నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి గురువారం పరిశీలించారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ, అక్కడ చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, చట్టబద్ధంగా జరిగేలా జిల్లా వ్యాప్తంగా కఠినమైన పోలీసు చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో అభ్యర్థులు, వారి మద్దతుదారులు గుంపులుగా చేరకూడదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు పరిమిత సంఖ్యలో (1+2) వ్యక్తులకు మాత్రమే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. నామినేషన్ల సమయాలను అభ్యర్థులు ముందుగానే స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీనివల్ల భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ సజావుగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, సభలు నిర్వహించరాదని, నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలిగించినా లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా ముగిసేందుకు అభ్యర్థులు, రాజకీయ నాయకులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!