

దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశాన్ని విభజించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఆయన, అలాంటి శక్తులను ఎదుర్కొనేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. తూర్పు దిల్లీలో నిర్వహించిన దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ.. శత్రువు ఎంత శక్తిమంతుడైనా సత్యం, మానవతా విలువలకు కట్టుబడి ఉంటే అంతిమ విజయం మనదేనని పేర్కొన్నారు. భారతీయ తాత్విక చింతనలో దసరా స్ఫూర్తి అంతర్భాగమని, ఈ పండుగ దేశ ప్రజలందరినీ ఏకం చేస్తుందని చెప్పారు.
సుపరిపాలనకు రామరాజ్యం ఆదర్శవంతమైన నమూనా అని మోదీ పేర్కొన్నారు. దేశం ముందు వికసిత్ భారత్ లక్ష్యం ఉందని, దానిని సాధించేందుకు శ్రీరాముడి ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. రామరాజ్యంలో వివక్షకు తావు ఉండదని, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, న్యాయం లభిస్తాయని వివరించారు. అధికారం అంటే పాలించడం మాత్రమే కాదని, ప్రజల సంక్షేమానికి కృషి చేయడమే నిజమైన నాయకత్వమని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం అన్ని సంస్థలు, రాజకీయ పార్టీలు ఏకమై శత్రువులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సంక్షోభాలు ఎంత క్లిష్టంగా ఉన్నా ఇతరులపై ఆధారపడకుండా తమ సామర్థ్యాన్ని గుర్తించి, సంకల్పాన్ని శక్తిగా మార్చుకొని కష్టపడి పరిష్కారాలను కనుగొనాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!