

హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలు, వినియోగంపై ఈగల్ ఫోర్స్ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎల్‌బీఎస్ నగర్‌లోని తన ఇంటి నుంచే గంజాయి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 75 ఏళ్ల షేక్ జాతెన్ బీని అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లో 41 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మొత్తం 179.1 గ్రాముల గంజాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో 70 మంది గంజాయి వినియోగదారులను గుర్తించారు. వారిలో 66 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అందరికీ డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు బాలురు ఉన్నారు. మొత్తం 65 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వారిలో 45 మందిని గాంధీ రిహాబిలిటేషన్ సెంటర్‌కు, 15 మందిని ఆమనగల్ కేంద్రానికి, ఐదుగురిని కొత్తూరు కేంద్రానికి పంపించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గంజాయి సరఫరా మూలాలు, ఈ వ్యవహారంలో ఇతరుల పాత్రపై ఈగల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. షేక్ జాతెన్ బీపై గతంలో మరో ఏడు కేసులు నమోదైనట్లు గుర్తించారు.
మరోవైపు, గచ్చిబౌలిలో తెలంగాణ టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫొటోగ్రాఫర్ ఏ. సాయిరామ్‌ను అరెస్ట్ చేసింది. ఖాజాగూడ సర్వీస్ రోడ్డులో అతడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 4.45 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. గ్రాము రూ.10 వేల చొప్పున డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. నిందితుడి నుంచి కారు, డిజిటల్ వేయింగ్ మిషన్, రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు మహేశ్‌రెడ్డి, తాండ్ర హరిశ్చంద్ర కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందినవారిగా గుర్తించారు. రెండు కేసుల్లోనూ డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!