

ఇజ్రాయెల్ తదుపరి ప్రధానమంత్రి ఎవరన్నది ఈ నెల 27న జరగనున్న ఎన్నికలతో తేలనుంది. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారా? లేక గాడి ఐసెన్‌కోట్, నఫ్తాలి బెన్నెట్, యూయిర్ లాపిడ్, మన్సూర్ అబ్బాస్‌లలో ఎవరైనా ప్రభుత్వ పగ్గాలు చేపడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం 120 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 7 దాడి సమయంలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలు, పెరుగుతున్న జీవన వ్యయం, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ప్రతిష్ఠ ఈ ఎన్నికల్లో కీలక అంశాలుగా నిలిచాయి. నెతన్యాహు నేతృత్వంలోని అధికార కూటమిలో జాతీయ భద్రతా మంత్రి ఇతమార్ బెన్-గ్విర్‌కు చెందిన ఓట్జా యెహుదిత్ వంటి అతివాద పార్టీలు, అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీలు ఉన్నాయి. మరోవైపు, యషార్ పార్టీ నాయకుడు గాడి ఐసెన్‌కోట్, బేయాహాద్ పార్టీ నాయకుడు నఫ్తాలి బెన్నెట్ ప్రధాన పోటీదారులుగా నిలుస్తున్నారు. సెప్టెంబర్ 8న వెల్లడైన పాలీ మార్కెట్ అంచనాల ప్రకారం ఐసెన్‌కోట్‌కు 51 శాతం, నెతన్యాహుకు 28 శాతం గెలుపు అవకాశాలున్నాయి. అయితే, ఇవి అంచనాలు మాత్రమే.
ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో కూటములదే కీలకపాత్ర కానుంది. ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అంచనాల ప్రకారం ఐసెన్‌కోట్ కూటమికి 54 స్థానాలు లభించే అవకాశం ఉండగా, నెతన్యాహు నేతృత్వంలోని మితవాద, అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీల కూటమికి 48–49 స్థానాలు రావొచ్చని అంచనా. 120 మంది సభ్యులున్న నెస్సెట్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత అంచనాల ప్రకారం ఏ కూటమికీ సొంతంగా మెజారిటీ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. అరబ్ ప్రాబల్యం ఉన్న పార్టీలు సుమారు 13 స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా వేస్తుండటంతో వాటి మద్దతు కీలకం కానుంది. నెతన్యాహు ఈ పార్టీల మద్దతును బహిరంగంగా వ్యతిరేకిస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా వాటిని కూటమిలో చేర్చుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత కూటముల కూర్పు, ఇతర పార్టీల మద్దతు ఆధారంగానే ఇజ్రాయెల్ తదుపరి ప్రధాని ఎవరో తేలనుంది.









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!