

శీతల వాతావరణానికి పేరుగాంచిన ఐరోపా ఖండం ప్రస్తుతం తీవ్ర వడగాల్పులతో అల్లాడిపోతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రతతో పలు దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. జూన్ నుంచి ఆగస్టు మధ్య వడగాల్పుల కారణంగా ఐరోపాలో 50,000 మందికి పైగా మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో సుమారు 32,600 మరణాలకు శిలాజ ఇంధనాల వినియోగం వల్ల తీవ్రమవుతున్న వాతావరణ మార్పులు కారణమని అంచనాలు సూచిస్తున్నాయి. ఒక్క బ్రిటన్లోనే ఈ వేసవిలో 4,354 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నట్లు తెలుస్తోంది. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్లలోనూ అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఐరోపాలో నమోదవుతున్న వడగాల్పులు అత్యంత తీవ్రంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. సహారా ఎడారి నుంచి ఉత్తరం వైపు కదులుతున్న వేడి గాలులు, ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పులు కలిసి ఈ పరిస్థితులకు దోహదం చేస్తున్నాయని పేర్కొంటున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం ఇటువంటి విపత్కర పరిస్థితుల తీవ్రతను పెంచుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు, ఐరోపా దేశాలు సమన్వయంతో వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో వేడిగాలుల ప్రభావం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!