

ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన అల్లర్లు, దుకాణాల దోపిడీల నేపథ్యంలో ఆన్‌లైన్‌లో దొంగసొత్తు విక్రయాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దోపిడీలకు గురైన ఖరీదైన వస్తువులు వింటెడ్, అమెజాన్, లెబాన్‌కాయిన్ వంటి ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో అమ్మకానికి వచ్చినట్లు గుర్తించారు. ఫ్రాన్స్ అధికారుల ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారు 3,000 వ్యాపార సంస్థలు ధ్వంసం లేదా దోపిడీకి గురయ్యాయి. పారిస్‌లోని లెస్ హాల్స్ ప్రాంతంలో హెర్మేస్, లూయిస్ విట్టన్, ది నార్త్ ఫేస్ వంటి ప్రముఖ బ్రాండ్ల దుకాణాలు కూడా ప్రభావితమైనట్లు నివేదికలు వెల్లడించాయి.
ఈ పరిణామంపై స్పందించిన వాణిజ్య శాఖ మంత్రి సెర్జ్ పాపిన్, డిజిటల్ వ్యవహారాల మంత్రి అన్నే లే హెనాఫ్.. వింటెడ్, అమెజాన్, ఈబే, మెటా, టిక్‌టాక్, లెబాన్‌కాయిన్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనుమానాస్పద లిస్టింగులను తొలగించడంతో పాటు, దొంగసొత్తును విక్రయిస్తున్నవారిని గుర్తించేందుకు అధికారులతో సహకరించాలని ప్లాట్‌ఫామ్‌లకు సూచించారు. దొంగ వస్తువుల విక్రయాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తున్నామని వింటెడ్ తెలిపింది. అనుమానాస్పద ప్రకటనలను గుర్తించేందుకు సాంకేతిక సాధనాలను ఉపయోగిస్తున్నట్లు ఈబే వెల్లడించింది. ఫ్రాన్స్ చట్టాల ప్రకారం, దొంగసొత్తును తెలిసి కొనడం, కలిగి ఉండటం లేదా విక్రయించడం వంటి నేరాలకు ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు 3,75,000 యూరోల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!