

ఫ్రాన్స్లో విద్యారంగ సంస్కరణలను కోరుతూ కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసనలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. పలు నగరాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పారిస్ నగర కేంద్రానికి సమీపంలో ఆందోళనకారులు ఓ కారుతో పాటు దుకాణానికి నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు, జలఫిరంగులను ప్రయోగించారు. దేశంలోని మూడో అతిపెద్ద నగరమైన లియోన్లో ఓ పర్యాటక కార్యాలయానికి నిప్పుపెట్టగా, మార్సెయిల్లో పోలీస్ స్టేషన్తో పాటు పలు దుకాణాలు ధ్వంసమైనట్లు సమాచారం. హింసాత్మక ఘటనలకు సంబంధించి దేశవ్యాప్తంగా 166 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడం, ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించడం, విద్యారంగానికి నిధులు పెంచడం, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను బాగుచేయడం వంటి డిమాండ్లతో నిరసనలు కొనసాగుతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల ప్రక్రియ సంక్లిష్టంగా ఉందంటూ విద్యార్థులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కార్మిక సంఘాలు సైతం ఈ నిరసనలకు మద్దతు తెలిపినట్లు సమాచారం. ఇటీవల వందలాది పాఠశాలలకు నిప్పుపెట్టిన ఘటనలు చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడటంతో విద్యా వ్యవస్థలో సంస్కరణల అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!