

భారతీయ ఇతిహాసాల్లో అత్యంత విశిష్టమైన స్థానం కలిగిన రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకి జయంతిని అక్టోబర్ 26న భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. పురాణ కథనాల ప్రకారం, వాల్మీకి పూర్వాశ్రమంలో రత్నాకరుడు అనే బోయవాడు. అడవుల్లో ప్రయాణించే బాటసారులను దోచుకుంటూ జీవనం సాగించేవాడు. ఒకసారి ఆ మార్గంలో వెళ్తున్న నారద మహర్షిని కూడా దోచుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు నారదుడు, కుటుంబాన్ని పోషించడం కోసం చేస్తున్న పాపకార్యాల్లో భార్యాపిల్లలు కూడా భాగస్వాములవుతారా అని ప్రశ్నించాడు. దీంతో ఆలోచనలో పడిన రత్నాకరుడు ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులను ఇదే విషయంపై అడిగాడు. అయితే, తమను పోషించాల్సిన బాధ్యత అతనిదేనని, అతను చేసే పాపపుణ్యాలతో తమకు సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల సమాధానంతో తన తప్పును గ్రహించిన రత్నాకరుడు తిరిగి నారద మహర్షిని ఆశ్రయించి, పాపాల నుంచి విముక్తి పొందే మార్గాన్ని చూపించాలని వేడుకున్నాడు.
నారద మహర్షి రత్నాకరుడికి రామనామ జపాన్ని ఉపదేశించి తపస్సు చేయమని సూచించినట్లు పురాణ కథనం చెబుతోంది. 'రామ' అనే పదాన్ని పలకలేకపోయిన రత్నాకరుడు 'మరా' అంటూ జపించడం ప్రారంభించాడని, నిరంతర జపం ద్వారా అదే రామనామంగా మారిందని విశ్వసిస్తారు. దీర్ఘకాలం తపస్సు చేయడంతో అతని చుట్టూ పుట్టలు ఏర్పడ్డాయని, వాటి నుంచి బయటకు వచ్చినందున అతనికి 'వాల్మీకి' అనే పేరు వచ్చిందని కథనం. అనంతరం నారద మహర్షి ప్రేరణతో వాల్మీకి సంస్కృతంలో రామాయణ మహాకావ్యాన్ని రచించిన ఆదికవిగా ప్రసిద్ధి చెందారు. వాల్మీకి జయంతి సందర్భంగా రామనామ జపం చేయడం, రామాయణ పారాయణం నిర్వహించడం, ఆయన జీవితంలోని పరివర్తనను స్ఫూర్తిగా తీసుకోవడం ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం కలిగినవిగా భావిస్తారు. తప్పులను తెలుసుకుని సన్మార్గంలో నడిస్తే జీవితంలో గొప్ప మార్పు సాధ్యమనే సందేశాన్ని వాల్మీకి జీవితం అందిస్తుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!