

దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. అయితే, నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరే పలు రైళ్లలో ఏసీ బోగీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండగా, జనరల్ బోగీలు తక్కువగా ఉండటంతో సామాన్య ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీతో పోలిస్తే రైలు టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించడం వల్ల కుటుంబాలకు ప్రయాణ ఖర్చు తగ్గుతుంది. కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
స్లీపర్, ఏసీ టికెట్లతో పోలిస్తే జనరల్ టికెట్లు తక్కువ ధరకు లభిస్తాయి. దీంతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా జనరల్ బోగీల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనరల్ కోచ్‌ల కొరతపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలులో తప్పనిసరిగా నాలుగు జనరల్ బోగీలు ఉండేలా రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని సామాన్యులు కోరుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!