

సెబీ నిర్దేశించిన కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనలను పాటించేందుకు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తన వాటాను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నాయి. ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ వాటా 81.19 శాతంగా, యుకో బ్యాంకులో 90.95 శాతంగా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 93.85 శాతంగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 92.44 శాతంగా ఉంది. స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన కంపెనీల్లో కనీసం 25 శాతం వాటా ప్రజల వద్ద ఉండాలని సెబీ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, రాబోయే ఏడాది కాలంలో ఈ బ్యాంకుల్లో పబ్లిక్ వాటాను పెంచేందుకు ప్రభుత్వం క్యూఐపీ లేదా ఆఫర్ ఫర్ సేల్ విధానాలను పరిశీలిస్తోంది. అయితే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో షేర్లను ఒకేసారి విక్రయించడం కష్టమని భావిస్తున్న బ్యాంకులు, గడువును మరో ఏడాది పొడిగించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరినట్లు సమాచారం. ఈ వాటాల తగ్గింపును బ్యాంకుల ప్రైవేటీకరణగా భావించకూడదు. సెబీ నిబంధనలను పాటించడమే దీని ప్రధాన ఉద్దేశం. వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు, సాధారణ పెట్టుబడిదారులకు ఈ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు పెరుగుతాయి. అయితే, విక్రయ ప్రక్రియకు సంబంధించిన తుది గడువు, విధివిధానాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!