

భూగర్భ జలాలను అవసరానికి మించి తోడేయడం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో భూమి కుంగుబాటుకు కారణమవుతోంది. భూగర్భ జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గినప్పుడు నేల పొరలకు లభించే ఆధారం బలహీనపడి భూమి ఉపరితలం క్రమంగా కిందకు దిగుతుంది. ఈ ప్రక్రియను ల్యాండ్ సబ్‌సిడెన్స్ అంటారు. ఇండోనేసియాలోని జకార్తా, చైనాలోని టియాంజిన్‌తో పాటు పలు నగరాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. నివేదికలో ప్రస్తావించిన అధ్యయనాల ప్రకారం, ఢిల్లీలోని కపషేరా ప్రాంతంలో ఏడాదికి సుమారు 10–17 సెంటీమీటర్లు, కోల్‌కతాలో కొన్ని ప్రాంతాల్లో 8–12 మిల్లీమీటర్ల మేర భూమి కుంగుతోంది. ఉపగ్రహ రాడార్ సాంకేతికతతో భూమి ఉపరితలంలో చోటుచేసుకునే సూక్ష్మ మార్పులను శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. తెలంగాణలోని రాతి పొరల కారణంగా కుంగుబాటు ముప్పు తక్కువగా ఉన్నప్పటికీ, హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో స్వల్ప ఆనవాళ్లు కనిపించినట్లు నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా–గోదావరి డెల్టా, విశాఖపట్నం తీరప్రాంతాల్లో ఒండ్రు నేలలు, తగ్గుతున్న భూగర్భ జలాల కారణంగా ప్రమాదం ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే, భూగర్భ జలాల నిర్వహణ ద్వారా భూమి కుంగుబాటును తగ్గించవచ్చని జపాన్‌లోని ఒసాకా నగరంపై జరిగిన పరిశోధనలు సూచిస్తున్నాయి. 1920 నుంచి 1960ల మధ్య అధికంగా భూగర్భ జలాలను వినియోగించడం వల్ల అక్కడ నీటి మట్టాలు గణనీయంగా తగ్గి, కొన్ని ప్రాంతాల్లో భూమి రెండు మీటర్లకు పైగా కుంగిపోయింది. దీంతో ప్రభుత్వం భూగర్భ జలాల వినియోగంపై కఠిన నియంత్రణలు అమలు చేసింది. 1985 నుంచి 44 పర్యవేక్షణ బావుల సమాచారాన్ని పరిశీలించిన పరిశోధకులు, భూగర్భ జల నిల్వలు పెరిగిన కొన్ని ప్రాంతాల్లో భూమి ఏడాదికి సుమారు 4 నుంచి 12 మిల్లీమీటర్ల మేర పైకి లేచినట్లు గుర్తించారు. అయితే, భూమి ఎంతవరకు తిరిగి పైకి వస్తుందనేది అక్కడి భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది; కొన్ని మార్పులు శాశ్వతంగా ఉండవచ్చు. అందువల్ల వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునర్భరణ, నీటి వినియోగంపై నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ చర్యలు భూమి మరింత కుంగిపోకుండా అడ్డుకోవడంతో పాటు నగరాల మౌలిక సదుపాయాలు, తీరప్రాంతాలను కాపాడటానికి తోడ్పడతాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!