

ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ ఎన్నికలకు మరోసారి ఆటంకం ఏర్పడింది. సమీప గ్రామాలను గూడూరు మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం. 2019లో ప్రభుత్వం చెన్నూరు, నెల్లటూరు, దివిపాలెం, పోటుపాలెం గ్రామాలతో పాటు చిల్లకూరులోని కొంత భాగాన్ని గూడూరు మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఈ నిర్ణయంపై కోర్టులో వివాదం మొదలవడంతో అప్పటి నుంచి ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
దాదాపు ఏడేళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, కనీస సౌకర్యాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికలు జరుగుతాయని ఆశించిన స్థానికులకు తాజా పరిణామం నిరాశ కలిగించింది. ఇప్పటికే కొన్ని వార్డుల్లో ప్రచారం ప్రారంభించిన ఆశావహులు, మున్సిపల్ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు అయోమయంలో పడ్డారు. చైర్మన్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో పలువురు మహిళా నేతలు పోటీకి సిద్ధమయ్యారు. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. తదుపరి న్యాయస్థాన ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి కొనసాగవచ్చని అధికారులు తెలిపినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!