

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన వాహనంపై ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా, ఆయన కారు డ్రైవర్ ఫిర్దౌస్, ఆటో డ్రైవర్ చౌహాన్ గాయపడ్డారు. ఫిర్దౌస్ ఎడమ చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. టైగర్ ష్రాఫ్, ఆయన స్నేహితుడు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తి లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. అయితే, కాల్పులకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ఘటనపై క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించి, తూటాల ఆనవాళ్లు, వాహనానికి సంబంధించిన ఇతర ఆధారాలను సేకరించింది. ఇదిలా ఉండగా, ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు పేర్కొంటూ ఓ పోస్టు ఆన్‌లైన్‌లో ప్రచారంలోకి వచ్చింది. అయితే, ఆ పోస్టు ప్రామాణికత, దాడితో ఆ గ్యాంగ్‌కు సంబంధం ఉందా లేదా అనే విషయాలను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!