

హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం కోల్పోయినవారికి మరో ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే నిబంధనను ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ‘ఎలిమినేటింగ్ ది డిస్క్రీషనరీ 60-డే గ్రేస్ పీరియడ్’ పేరుతో ఈ ప్రతిపాదనను ఫెడరల్ రిజిస్టరులో ప్రచురించనుంది. దీనిపై 60 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని డిపార్టుమెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) పేర్కొంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ముఖ్యంగా భారతీయ టెక్ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ప్రతిపాదన ఆమోదం పొందితే వీసా గడువు ఉన్నప్పటికీ ఉద్యోగం కోల్పోయిన వెంటనే విదేశీ ఉద్యోగులు అమెరికాను విడిచిపెట్టాల్సి రావచ్చు. ప్రత్యేక అనుమతి ఉంటేనే అక్కడ కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 60 రోజుల వెసులుబాటు ఈ1, ఈ2, ఈ3, హెచ్1బీ, హెచ్1బీ1, ఎల్1, ఓ1 వీసాదారులతో పాటు టీఎన్ వలసేతరులకు వర్తిస్తోంది. 2016లో ఒబామా ప్రభుత్వం ఈ గ్రేస్ పీరియడ్‌ను ప్రవేశపెట్టింది. 2025లో ఉద్యోగాలు కోల్పోయిన లేదా మార్చుకున్న 65,752 మంది ఈ వెసులుబాటును వినియోగించుకున్నట్లు డీహెచ్‌ఎస్ అంచనా వేయగా.. 2023లో ఈ సంఖ్య 80,034గా ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!