

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాక రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకేజీ కారణంగా ఇద్దరు కార్మికులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
గతంలో సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు, అధికారుల పర్యవేక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. సరాక పరిశ్రమ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను పటిష్టం చేయాలని కోరారు. సిగాచి ప్రమాదంలో కుటుంబ పెద్దలను కోల్పోయిన 54 కుటుంబాలకు సీఎం ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని కూడా వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!