

ప్రస్తుత కాలంలో చిన్నారులు జంక్ ఫుడ్‌కు ఎక్కువగా అలవాటుపడుతుండటం, చిన్న వయసులోనే ఊబకాయం సమస్యలు ఎదుర్కొంటుండటంతో కొన్ని కేఫేలు ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. పిల్లలు ఇష్టపడే పిజ్జాలు, బర్గర్లను మైదాతో కాకుండా పోషక విలువలున్న మిల్లెట్లతో తయారు చేస్తూ రుచి, ఆరోగ్యాన్ని ఒకేచోట అందించే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని కేఫేల్లో చిన్నారులను ఆకట్టుకునే కార్టూన్ పాత్రలతో ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చోటా భీమ్ కేఫేలో పిల్లల కోసం డ్రైఫ్రూట్స్, పోషక పదార్థాలతో తయారుచేసిన ‘సిగ్నేచర్ పవర్ లడ్డూలు’ అందిస్తున్నారు. దీంతోపాటు ‘హెల్దీ బెంటో బాక్స్’ పేరుతో పాఠశాలలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం నేరుగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆహారంతో పాటు పిల్లల్లో సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాలను పెంపొందించడంపైనా ఇలాంటి కేఫేలు దృష్టి సారిస్తున్నాయి. నిపుణుల పర్యవేక్షణలో చిన్నారులే స్వయంగా వంటలు చేసేలా ‘జూనియర్ చెఫ్’ కార్యక్రమాలు నిర్వహిస్తూ వంటను సరదాగా నేర్చుకునే జీవన నైపుణ్యంగా పరిచయం చేస్తున్నారు. ఆటలు, వర్క్‌షాప్‌లు, తోటి పిల్లలతో కలిసి చేసే కార్యక్రమాల ద్వారా డిజిటల్ స్క్రీన్లకు దూరంగా ఉంచడంతో పాటు వారిలో కలిసిమెలిసి ఉండే గుణాన్ని పెంపొందించవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. తల్లిదండ్రులు తమకు నచ్చిన పనుల్లో నిమగ్నమయ్యేలా సౌకర్యాలు కల్పిస్తూ, పిల్లలకు పోషకాహారం, వినోదం, సృజనాత్మక కార్యక్రమాలు ఒకేచోట అందించడమే లక్ష్యమని చోటా భీమ్ కేఫే వ్యవస్థాపకుడు సీహెచ్. రాజీవ్ తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!